బెంగళూరు (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: సాధారణంగా మనం విమానాశ్రయంలోకి వెళ్లగానే బోర్డింగ్ పాస్ తీసుకుని లగేజీని చెక్ చేయించుకుని లోపలికి వెళ్తుంటాం. భద్రతా సిబ్బంది ప్రతి ప్రయాణికుడిని, బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి మరీ లోపలికి పంపిస్తుంటారు. అయితే ఓ ప్రయాణికుడు మాత్రం తనిఖీ నిమిత్తం తాను ధరించిన ఖరీదైన వాచ్‌ను తీసి ట్రేలో పెట్టమని చెప్పినందుకు కాసేపు హంగామా సృష్టించాడు. చివరికి భద్రతా సిబ్బంది సముదాయించడంతో అంగీకరించి తనిఖీ చేయించుకుని విమానం కోసం వెళ్లిపోయాడు. మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగుచూసింది. దిల్లీ వెళ్లేందుకు బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయానికి ఓ ప్రయాణికుడు వచ్చాడు. సెక్యూరిటీ స్క్రీనింగ్ కోసం క్యూలైన్‌లో నిలబడ్డాడు. తన వంతు వచ్చేసరికి అతడి చేతికి ఉన్న వాచ్‌తో సహా వస్తువులను ట్రేలో పెట్టాలని భద్రతా సిబ్బంది కోరారు. అయితే ఖరీదైన రొలెక్స్ వాచ్‌ను (రూ.40 లక్షలు) తీసేందుకు ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. స్క్రీనింగ్ ప్రాసెస్‌లో చోరీకి గురైతే ఏం చేస్తారని ప్రశ్నించడంతో అధికారులు అవాక్కయ్యారు. అలాంటిదేమీ జరగదని భద్రతా సిబ్బంది హామీ ఇచ్చి నచ్చజెప్పినా వినలేదు. చాలా సేపటి తర్వాత అంగీకరించి ప్రాసెస్‌ను పూర్తి చేసుకుని వెళ్లిపోయాడు. ‘‘ఆ ప్రయాణికుడి వంతు వచ్చేసరికి భద్రతా సిబ్బంది అతడి చేతికి ఉన్న వాచ్‌ను తీసి స్క్రీనింగ్ కోసం ట్రేలో పెట్టాలని సూచించారు. అయితే సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను పాటించేందుకు అతడు ఒప్పుకోలేదు. దాదాపు రూ.40 లక్షల విలువైన రొలెక్స్ వాచ్‌ను అక్కడ పెట్టలేనని చెప్పాడు. స్క్రీనింగ్ ప్రాసెస్‌లో చోరీకి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు’’ అని అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘‘ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని, సహకరించాలని సీఐఎస్‌ఎఫ్ అధికారులు అతడికి వివరించారు. ఎంత చెప్పినా వినకపోవడంతో కాసేపు పక్కన నిల్చోబెట్టాం. తనిఖీ ప్రక్రియ పూర్తి అయితేనే విమానం ఎక్కేందుకు అనుమతిస్తాం అని చెప్పడంతో చివరికి అంగీకరించాడు. స్క్రీనింగ్ పూర్తి చేసి లోపలికి పంపించాం’’ అని మరొక అధికారి తెలిపారు







