UPDATED 26th FEBRUARY 2018 MONDAY 5:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగంలో స్పేస్ టెక్నాలజీ అనే అంశంపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించినట్లు క్యాంపస్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి బెంగుళూరు ఇస్రో హెడ్ క్వార్టర్స్ కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ గీతావరదన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీపై అవగాహన, ఉద్యోగ అవకాశాలు, శాటిలైట్ ద్వారా డాటా ప్రాసెసింగ్ , డాటా కంట్రోల్ పై అవగాహన కల్పించారు. స్పేస్ టెక్నాలజీ సాధారణ ప్రజానీకానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇస్రో లో గల ఉద్యోగ అవకాశాలు గురించి విద్యార్థులకు సవివరంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో విభాగ అధిపతులు ప్రొఫెసర్ జి. శ్రీదేవి, ప్రొఫెసర్ వి. సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. సత్య శ్రీదేవి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







