* మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు
* ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
UPDATED 21st OCTOBER 2018 SUNDAY 8:00 PM
పెద్దాపురం: నేరాలను అరికట్టి శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ కృషి చేస్తోందని మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిఎస్పీ చిలకా వెంకటరామారావు ఆధ్వర్యంలో పట్టణంలో పోలీసులు భారీ ర్యాలీ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ సూరిబాబురాజు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర పోలీసులు నేరాలను నియంత్రించడంలో, నేర పరిశోధనలో పురోగతి సాధిస్తున్నారని అన్నారు. అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి త్యాగాలను మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు విడిచిన పోలీసుల త్యాగాలను వృథాగా పోనివ్వమని, చిరస్థాయిగా నిలిపేందుకు పాటుపడతామని పేర్కొన్నారు. డిఎస్పీ చిలకా వెంకట రామారావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను ప్రతీ ఒక్కరూ గౌరవించడమే నిజమైన నివాళిగా అభివర్ణించారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా నిజాయతీగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సమాజంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు పోలీసుల సేవలు కారణమని, తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల రక్షణకు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, సిఐ జి. యువకుమార్, ఎస్ఐ ఎ. కృష్ణభగవాన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







