UPDATED 12th OCTOBER 2022 WEDNESDAY 05:00 AM
Dwaraka Thirumala: ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీచక్రవార్యుత్సవ శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం తొళక్క వాహనంపై శ్రీచక్ర పెరుమాళ్లు, అలివేలు మంగ, ఆండాళ్ అమ్మవార్లతో కలసి క్షేత్ర తిరువీధుల్లో ఊరేగారు. తరువాత ఆలయ ఆవరణలో శ్రీచక్రవార్యుత్సవాన్ని అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా జరిపించారు.
ఆలయ ఆవరణలో శ్రీవారు, అమ్మవార్లు, చక్ర పెరుమాళ్లును ఒక వేదికపై వేంచేపు చేసి సుగంఽధ ద్రవ్యాలు, పంచ పల్లవులు, శ్రీచందనం, పసుపు, మంత్రపూత జలంతో శ్రీచక్ర స్వామిని అభిషేకించారు. అనంతరం పంచామృతాభిషేకం చేశారు.
సాయంత్రం పూర్ణాహుతి హోమాన్ని శాస్త్రబద్దంగా జరిపారు. అనంతరం ధ్వజ అవరోహణ చేశారు. అఖడ్గాన్ని చేతబూని అశ్వవాహనాన్ని అదిరోహించి దుష్టజన సంహారం శిష్టజన సంరక్షణ, ధర్మ స్థాపనకు అశ్వవాహనంపై వెళుతున్న శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఉట్టికొట్టే శ్రీకృష్ణుని అలంకరణలో శ్రీవారు ఉభయ నాంచా రులతో దర్శనమిచ్చారు.
అమ్మవార్లు ఉట్టి తాళ్లను లాగుతుండగా ఒకచేత పిల్లన గ్రోవి మరో చేత కర్రను చేత బూని తలపై నెమలిపింఛం దరించి నీలమేఘ శ్యాముడైన శ్రీకృష్ణుడు ఉట్టికొట్టే సన్నివేశాన్ని భక్తులు దర్శించి తరించారు.







