UPDATED 9TH MAY 2017 TUESDAY 1:00 PM
సామర్లకోట: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శిక్షణా అకాడమిని రూ.198 కోట్లతో నిర్మించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ తెలిపారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు. సుమారు 20 ఎకరాలలో ఈ అకాడమి ఏర్పాటుకు ప్రతిపాదించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. దీనిలో భాగంగా స్థల పరిశీలనకు ఇక్కడకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీ లో నూతన కార్యక్రమాలను చేపడుతున్నామని వీటిలో ఎక్సైజ్ శిక్షణా అకాడమి, చెక్ పోస్ట్ లు, మొబైల్ వాహనాలు ఉన్నాయన్నారు. ఎక్సైజ్ కూడా లా అండ్ ఆర్డర్ తో సమానంగా పనిచేయడం వల్ల ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎక్సైజ్ పాలసీ పని చేస్తుందన్నారు. ఎమ్మార్పీ రేట్ కంటే మద్యం ధరలను ఎక్కువగా అమ్మితే రూ. లక్ష అపరాధ రుసుము వసూలు చేస్తున్నామని, కొత్త పాలసీ లో ఇంకా అదనంగా వసూలు చేసే అవకాశం ఉందన్నారు. ఎక్సైజ్ కార్యాలయానికి సొంత భవనాలు ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు కాంట్రాక్టు పద్ధతిలో పోస్ట్ లు భర్తీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం అధికారులతో కలిసి శిక్షణా అకాడమి కి కేటాయించిన స్థలాన్ని ఎక్సైజ్ కమీషనర్ లక్ష్మీ నరసింహారావు తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెఎన్టీయూ వైస్ ఛాన్సలర్ వి.ఎ.ఎస్ కుమార్, ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ అరుణారావు, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు రామచంద్రరావు, సుర్జీత్ సింగ్, దేసిదాసు, కాకినాడ ఎక్సైజ్ సి.ఐ పల్లె శ్రీనివాసరావు, ఎస్.ఐ కుమార్, సామర్లకోట ఎఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసా చార్యులు, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ అడబాల కుమార స్వామి, మన్యం చంద్రరావు, గుమ్మళ్ల రామకృష్ణ, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







