UPDATED 1st MAY 2018 TUESDAY 7:00 PM
కాకినాడ: చదువు, ఆటపాటలతో ఎదగాల్సిన బాలికలు బాల్య వివాహాల కారణంగా శారీరకంగా, మానసికంగా బలహీనులవుతున్నారని, వీరిని పరిరక్షించడానికి ప్రభుత్వం బాల్య వివాహ నిరోధక చట్టం- 2006 ప్రవేశపెట్టి అమలు చేస్తుందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యుడు వి. గాంధీబాబు తెలిపారు. స్థానిక కలక్టరేట్ కోర్టు హాలులో మహిళా, శిశు సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన బాల్య వివాహ నిరోధక అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలకు 18 సంవత్సరాలు పూర్తయిన తరువాత వివాహాలు చేయాలని, చిన్న వయస్సులో వివాహాలు చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎదగలేక విద్యకు దూరమవుతున్నారన్నారు. చిన్నవయస్సులో వివాహం చేయడం వల్ల తన శరీరం గురించి సరైన అవగాహన, ఆలోచన లేక గర్భందాల్చి, పరిపక్వత లేని శరీరంతో బాలికలు తల్లులు అవుతున్నారన్నారని, ఈ పరిస్థితుల్లో తీవ్రమైన అనారోగ్యాల బారిన పడుతున్నారని, మాతా శిశు మరణాల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణమని ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలలో బాల్య వివాహాలు జరుగుతున్నాయని, వీటి మూల కారణాలు తెలుసుకుని, వ్యవస్థను సరిచేయడానికి కమీషన్ కృషి చేస్తుందన్నారు. 2006 సంవత్సరంలో బాల్య వివాహ నిరోధక చట్టం ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలుచేస్తుందని, దీనిలో పంచాయతీ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి మోనిటర్ చేస్తుందన్నారు. బాల్య వివాహాలు నిరోధం ద్వారా మాతా శిశు మరణాలు తగ్గుతాయన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, వైద్యం ఆరోగ్యం, విద్య, పోలీస్, పంచాయతీ శాఖల సమన్వయంతో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారుల సమన్వయంతో పనిచేసి బాల్య వివాహాల నిరోధానికి చర్యలు చేపడతారన్నారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం అవగాహనతో పనిచేసి నిరోధానికి చర్యలు చేపట్టిందన్నారు. పాఠశాల స్థాయి నుండే పిల్లలకు బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కల్పించి వారు చదువుకునేలా ప్రోత్సహించాలన్నారు. బాల్య వివాహాలు చేయడం నేరమని, దీనిని చేస్తున్న తల్లిదండ్రులతో పాటు ఇందుకు తోడ్పాటునందించిన వంటవారు, టెంట్ సామానులు ఇచ్చేవారు, మంత్రాలు చదివే వారు కూడా శిక్షార్హులేనని, వీరికి ఆరు నెలల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించడం జరుగుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామస్థాయిలో విఆర్వో నుంచి డిఎస్పీ వరకు బాల్య వివాహాలు నిరోధక చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఎక్క డైన బాల్య వివాహాలు జరుగుతుంటే వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందజేయాలన్నారు. ప్రతి పాఠశాల, హాస్టల్, వసతి గృహాలలో కంప్లైంట్ బాక్సులు ఏర్పాటుచేసి వారి సమస్యలను ఆ బాక్సులలో వేసేలా బాలలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలలో ఈ చట్టం అమలుపై కమిటీలకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సబ్-కలక్టర్ వి. వినోద్ కుమార్, రాజమహేంద్రవరం సబ్- కలక్టర్ సాయికాంత్ వర్మ, చింతూర్ ఐటిడిఏ పివో అభిషిక్త్ కిషోర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ పిడి సీతామహాలక్ష్మి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి వెంకటరావు, డిఎస్పీ రవివర్మ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ రమేష్ బాబు, డిఇవో ఎస్. అబ్రహం, ఎస్ఎస్ఏ పివో శేషగిరి, తదితరులు పాల్గొన్నారు.







