అమరావతి (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. బొంపల్లె ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడినట్టు వివరించారు.
రాష్ట్రంలో వైసీపీ వర్గీయుల అరాచకాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తిక్కారెడ్డికి తగిన భద్రత కల్పించాలని కోరారు. గతేడాది ఫిబ్రవరిలోనూ తిక్కారెడ్డిపై వైసీపీ వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని.. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోందన్నారు. తిక్కారెడ్డికి ఏవిధమైన ప్రమాదం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని, నేరస్థులపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా.. మరిన్ని నేరాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.







