UPDATED 21st OCTOBER 2017 SATURDAY 6:00 PM
విజయవాడ : ప్రజాస్వామ్య వ్యవస్ధలో పోలీసు దళాల పాత్ర ఎంతో కీలకమని, అలాగే ప్రతి పోలీసు దేశానికి వెన్నెముఖలాంటివాడని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారని ఆయన కొనియాడారు. విజయవాడ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరిగిన "పోలీసు అమర వీరుల సంస్మరణ" కార్యక్రమంలో శనివారం పాల్గొన్న చినరాజప్ప పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశ అంతర్గత, బహిర్గత శత్రువుల నుండి సామాన్య ప్రజలను కాపాడడంలో త్యాగాలకు సిద్దమవుతున్న పోలీసులు చిరస్మరణీయులని కొనియాడారు. చిన్న చిన్న సమస్యల నుంచి ప్రకృతి వైపరీత్యాల వరకు పోలీసులు చేస్తున్న సేవలు అమోఘమన్నారు. ప్రతి మనిషి తాను పుట్టినప్పటి నుంచి మరణించే వరకూ ప్రతీ కదలికలో అతనిని కాపాడటంలో పోలీసుల పాత్ర స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు. పోలీసుల సహకారం లేనిదే బహిరంగసభలు, ర్యాలీలు, ఎన్నికలు, పరీక్షలు నిర్వహించడం సాధ్యంకాని పరిస్ధితులున్నాయని, ఏ రాష్ట్రమైనా ప్రశాంతంగా ఉంటెనే అభివృద్ధి సాధ్యమౌతుందన్నారు. అభివృద్ధి జరగాలంటే సమాజం ప్రశాంతంగా ఉండాలి. సమాజం ప్రశాంతంగా ఊండాలంటే పోలీసుల సేవలు అవసరమని చినరాజప్ప స్పష్టం చేశారు. సమాజంలో పోలీసులు కూడా భాగమని గుర్తించి వారికి సహకరించాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రజాసేవే పోలీసుల పరమావధి, ప్రజలు ప్రశాంత జీవనం గడపటమే పోలీసుల సంకల్పమని చినరాజప్ప తెలిపారు. దేశ రక్షణ, భద్రత కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు స్పూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. రాష్ట్రంలోని పోలీసు అమరవీరుల కుటుంబాలు, పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో చర్యలు చేపట్టారని ఆయన చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యులను చేసేందుకు "సామాజిక పోలీసింగ్" కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని చినరాజప్ప తెలిపారు. కేసుల దర్యాప్తుల్లో భాగంగా అన్నిముఖ్య పట్టణాలల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి వాటిని విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని పోలీసు సంక్షేమంకోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసి అనంతపురం, కర్నూలుల్లో కళ్యాణ మండపాలు నిర్మించినట్టు చినరాజప్ప వివరించారు. పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.4.5 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 55 వేల మంది పోలీసులకు వైద్య పరీక్షలు జరిపించిందన్నారు, ఆరోగ్య భద్రత పథకంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను చేర్చినట్టు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. విధుల్లో ఉపశమనం కల్పించే ఉద్దేశ్యంతో కొన్ని జిల్లాల్లో పోలీసులకు "వారాంతపు సెలవు"ను అమలు చేస్తున్నారని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలోని పోలీసులందరికి గృహాలు నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందని చినరాజప్ప వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీజీపి నండూరి సాంబశివరావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు.







