విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 6 జనవరి 2022 : కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లడం రాష్ట్ర ప్రభుత్వానికి రివాజుగా మారిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. చెత్త పన్ను విషయంలో అధికార పార్టీ నాయకుల మాటలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో జీవీఎలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేయట్లేదని మండిపడ్డారు. మిర్చి పంటపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సీఎంకు లేఖ రాసినట్లు జీవీఎల్ చెప్పారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో మిర్చి పంటను పరిశీలించినట్లు తెలిపారు. పంటకు తెగుళ్లతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని జీవీఎల్ లేఖలో పేర్కొన్నారు.







