UPDATED 25th MARCH 2018 SUNDAY 6:30 PM
తొండంగి: సీతారాముల దాంపత్యాన్ని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఎ.వి.నగరంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా గణపతి పూజతో ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకస్వాములు సీతారాముల ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామకృష్ణుడు మాట్లాడుతూ మనదేశంలో భారతీయులు సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను గౌరవిస్తారని, శ్రీరామనవమి పర్వదినాన ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తుందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ స్వామిని కోరినట్లు మంత్రి తెలిపారు. అనంతరం దేవస్థానం భక్తులకు పులిహార, పానకం ప్రసాదాలుగా అందించారు. ఈ కార్యక్రమంలో తుని మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు, యనమల ఫౌండేషన్ కోశాధికారి యనమల నాగేశ్వరరావు, పెద్దాపురం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







