UPDATED 6th JUNE 2026 8:00 PM
బీజేపీ వీడిన మాజీ ఐపీఎస్‌కు అనూహ్య మద్దతు
24 గంటల్లోనే 14 లక్షల మంది వాలంటీర్ల నమోదు
కుటుంబ, వ్యక్తిపూజ రాజకీయాలకు వ్యతిరేకంగా కొత్త ఉద్యమం
చెన్నై, రెడ్ బీ న్యూస్, జూన్ 6 : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేసి, సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన సరికొత్తగా ఆరంభించిన ‘వియ్ ది పీపుల్’ (We the People) సామాజిక-రాజకీయ ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ వేదికను ప్రకటించిన కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 14 లక్షల మంది వాలంటీర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవడం తమిళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వచ్చే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యం!
ద్రవిడ రాజకీయాల కోటలో సరికొత్త ప్రత్యామ్నాయ శక్తులకు చోటు లేదనే అంచనాలను తలకిందులు చేస్తూ అన్నామలై దూసుకుపోతున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా, క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలే కేంద్రంగా తమ ప్రయాణం సాగుతుందని ప్రకటించారు.
"ప్రస్తుత రాజకీయాల్లో అసలైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. వ్యక్తి పూజలు, కుటుంబ రాజకీయాల నుంచి వ్యవస్థను విముక్తం చేయడమే నా సంకల్పం. రాబోయే తరాలకు ఒక బలమైన, పారదర్శకమైన పునాదిని అందించడమే ‘వియ్ ది పీపుల్’ ముఖ్య ఉద్దేశం."
మార్పునకు మూలస్తంభాలు వాలంటీర్లే..
తన ఉద్యమానికి వాలంటీర్లే జీవనాడి అని అన్నామలై అభివర్ణించారు. కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేయడం, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడటం వాలంటీర్ల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు. ముఖ్యంగా.. విద్య, ఆరోగ్యం, పర్యావరణం వంటి కీలక రంగాలను ఎంచుకుని, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
సమాజంలో మేలైన మార్పు కోసం, రేపటి తరం భవిష్యత్తు కోసం సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా క్షేత్రస్థాయిలో ఉన్న పట్టు, యువతలో ఆయనకున్న క్రేజ్ కారణంగానే ఈ స్థాయిలో మద్దతు లభిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భారీ ప్రజాస్పందన రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.







