రెడ్ బీ న్యూస్,18 జనవరి 2022 : రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ 'కొమరం భీమ్'గా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం, రణం, రుధిరం). ఈనెల 1న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. 'ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరించిన కారణంగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు అల్లూరి యువజన సంఘం జాతీయ అద్యక్షుడు వీరభద్రరావు తెలిపారు. చిత్రంలో అభూత కల్పనలు వద్దని. . విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తే సహించమన్నారు. బిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజును బ్రిటిష్ పోలీసుగా చూపించడం దారుణమని... ఇదే విషయంపై సినిమా నిర్మాతలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. అల్లూరి, కొమురం భీమ్ కలిసినట్లు చరిత్రలో ఎక్కడా లేదని, అలాంటిది.. ఆ ఇద్దరినీ కలిపి సినిమాగా తీయడం సరికాదన్నారు. రాజమౌళి చరిత్రను మారుస్తున్నారని... అలా చిత్రీకరించి భావితరాలకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు చరిత్రను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. 'ఆర్ఆర్ఆర్ కేవలం కల్పిత కథ అని, స్వాతంత్ర్య పోరాటంలో ఆ ఇద్దరు మహావీరులు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో రూపొందిస్తున్నామని రాజమౌళి వివరణ ఇచ్చినప్పటికీ చరిత్రను వక్రీకరించకూడదన్నారు. ఇప్పటికైనా ఆల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను సినిమా నుంచి వెంటనే తొలగించాలని వీరభద్రరావు డిమాండ్ చేశారు. కాగా కొన్ని రోజుల క్రితం అల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అల్లూరి, కొమురంభీం జీవన విధానాలకు విరుద్ధంగా ఈ సినిమాను చిత్రీకరించడం చట్ట విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై పూర్తిస్థాయి విచారణ జరగాల్సి ఉంది.







