UPDATED 18th JUNE 2026 10:00 AM
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూన్ 18: కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వార్షిక జాతర ఉత్సవాల్లో భాగంగా అత్యంత కీలకమైన తొలి ఘట్టానికి దేవస్థానం అధికారులు, అర్చకులు గురువారం ఘనంగా శ్రీకారం చుట్టారు. ఉత్సవాల ప్రారంభ సూచికగా అమ్మవారి 'తొలి గరగల' ఊరేగింపును పట్టణంలో కన్నులపండువగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ గరగలను ఊరేగిస్తూ ఆలయానికి తీసుకువచ్చారు.
భక్తుల కోలాహలం: జాతర ప్రారంభం కావడంతో పెద్దాపురం పట్టణమంతా పండగ వాతావరణం సంతరించుకుంది. తొలి గరగల ఉత్సవాన్ని తిలకించడానికి స్థానిక భక్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.అధికారుల ఏర్పాట్లు: భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కమిటీ, అసిస్టెంట్ కమిషనర్ కే.విజయలక్ష్మి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు గాను పోలీస్ శాఖ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. మరిడమ్మ తల్లి జాతర ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాబోయే రోజుల్లో మరిన్ని విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.







