UPDATED 10th JUNE 2022 FRIDAY 05:30 PM
TDP Rythu Poru : ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సై అంటే సై అంటున్నాయి. ప్రతి అంశంలో ఇరు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నారు. మాటల యుద్ధానికి దిగుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యక్రమాలు రూపొందిస్తోంది. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా వ్యూహాలు రచిస్తోంది. తాజాగా టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోరుబాట పట్టింది.రైతు పోరు పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి బహిరంగ సభలకు శ్రీకారం చుట్టనున్నారు. ఐదేసి పార్లమెంట్ స్థానాలు, ఒక జోన్ పరిధిలో రైతు పోరుబాట కార్యక్రమాలు నిర్వహించాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఏడు ప్రధాన సమస్యలపై రైతులను చైతన్య పరచడమే ప్రధాన ఎజెండాగా రైతు పోరుబాట సభలకు ప్లాన్ చేశారు.
* 20న కడప పార్లమెంట్ పరిధిలో రైతు పోరుబాట
* 25న నెల్లూరు పార్లమెంట్ పరిధిలో రైతు పోరుబాట
* జులై 1న కాకినాడ పార్లమెంట్ పరిధిలో రైతు పోరుబాట
* జులై 7న విజయనగరం పార్లమెంట్ పరిధిలో రైతు పోరుబాట
జులై 13న విజయవాడ పార్లమెంట్ పరిధిలో రైతు పోరుబాట వ్యవసాయ మోటర్లకు మీటర్లు-రైతుల పాలిట ఉరితాళ్లు అనే సమస్య పై చర్చించనున్నారు. అలాగే రైతు ఉత్పత్తులకు మద్దతు ధర, పంట నష్ట పరిహారం చెల్లింపు, పంట కాలువల మరమ్మత్తు-నిర్వహణ, వ్యవసాయ యాంత్రీకరణ, బిందు సేద్యం, సూక్ష్మ పోషకాలు అంశాలపై చర్చించనున్నారు. సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, కాలవ శ్రీనివాసులు, జ్యోతుల నెహ్రూ, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, బీసి జనార్ధన్ రెడ్డి తదితరుల నేతృత్వంలో రైతు పోరుబాట బహిరంగ సభలు జరగనున్నాయి.







