UPDATED 1st OCTOBER 2022 SATURDAY 05:00 AM
Thirumala Brammotsavalu : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
సర్వభూపాల వాహనం – యశోప్రాప్తి
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఎంపి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.







