UPDATED 30th APRIL 2018 MONDAY 9:00 PM
రంపచోడవరం: గిరిజన గ్రామాలకు అనుసంధానరోడ్లు ఏర్పడితే అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని, ఆ దిశగా ఇంజనీరింగ్ విభాగాల సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సబ్-కలక్టర్ డాక్టర్ వి. వినోదకుమార్ అన్నారు. స్థానిక ఐటిడిఎలో చింతూరు, రంపచోడవరం ఐటిడిఎల పరిధిలోని వివిధ విభాగాల ఇంజనీర్లతో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో రోడ్డు నిర్మాణాలలో ఉత్పన్నమైన అటవీ అభ్యంతరాలు, అలాగే మంజూరైన వివిధ రోడ్డు నిర్మాణాల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు అనుసంధాన రోడ్లు ఏర్పడితే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ది చెందుతాయని, రోడ్డు నిర్మాణాలలో ఏర్పడే సమస్యలను సంబంధిత శాఖల ద్వారా పరిషారానికి చర్యలు చేపట్టి అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి రోడ్డు మార్గాలు పూర్తిస్థాయిలో ఉన్నప్పుడే విద్య, వైద్యం, గృహ నిర్మాణాలు, సి.సి. రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పడి అభివృద్ధికి సాధ్యపడుతుందన్నారు. గిరిజన గ్రామాలలో వేసే రోడ్ల నిర్మాణాలలో ఏర్పడే అటవీ అభ్యంతరాలు పరిష్కారానికై ఒక హెక్టారుకు మించకుండా అటవీహక్కుల గుర్తింపు చట్టం-2006 క్రింద ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. అలాగే రెండు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణంలో రెండు హెక్టార్లు విస్తీర్ణంమేర అటవీ అభ్యంతరాలు వచ్చిన యెడల ఒక గ్రామం పేరుతో ఒక హెక్టారు, మరో గ్రామం పేరుతో ఒక హెక్టారు భూమి అనుమతులకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం క్రింద ప్రతిపాదనలు పంపి మంజూరు కోరాలని ఆదేశించారు. రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గిరిజన గ్రామాలలో చాలావరకు సమస్యలు తీరుతాయన్నారు. విద్య, వైద్యం, సురక్షిత త్రాగునీరు వంటి మౌలికవసతుల కల్పనకు రోడ్లు తప్పనిసరిగా ఉండాలని, అనుసంధానరోడ్లు వంటి మౌలిక వ్యవస్థలు సక్రమంగా ఉంటే గిరిజన తండాలు, లోతట్టు గ్రామాలు అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చింతూరు పివో ఎం. అభిషిక్త్ కిశోర్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇఇ పి.కె. నాగేశ్వరరావు, డిఇలు జనార్దన్, వేణుగోపాల్, డేవిడ్ రాజు, ఆర్ & బి డిఇ పి.ఎస్.ఐ. లక్ష్మీ, పంచాయితీరాజ్ డిఇ సత్యనారాయణ, అసిస్టెంటు, జూనియర్ ఇంజనీర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి బి. సరస్వతి, తహసీల్దార్ పి. రామోజి, తదితరులు పాల్గొన్నారు.







