* నూతన రథానికి శాస్త్రోక్తంగా సీఎం పూజలు
* రథం లాగి స్వామి వారి కల్యాణోత్సవాలకు శ్రీకారం
* స్వల్ప వ్యవధిలో రథం నిర్మాణంపై ప్రశంస
UPDATED 19th FEBRUARY 2021 8:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కొలువైఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రూ.1.16 కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన నూతన దివ్య రథాన్ని రధ సప్తమి పర్వదినాన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు అంతర్వేదిలోని ఫిషింగ్ హార్బర్ హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనితతో పాటు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, అమలాపురం సబ్-కలెక్టర్ హిమాన్షు కౌశిక్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి మేళ తాళాలు, ఆలయ మర్యాదలతో అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి తొలుత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆశీర్వచన మండపంలో పండితుల వేదాశీర్వచనం, శేష వస్త్రం స్వీకరించారు. తదుపరి ఆలయ ప్రాంగణంలో 41 అడుగుల ఎత్తు, ఏడు అంతస్తులతో స్వల్పకాల వ్యవధిలో నూతనంగా నిర్మించిన స్వామి వారి దివ్య రథానికి ముఖ్యమంత్రి ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రులు, తదితర ప్రజా ప్రతినిధులతో కలిసి తాడు లాగి రథాన్ని ప్రారంభించారు.







