UPDATED 25th MAY 2026 9:00 AM
* లీగల్ మెట్రాలజీ నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు
* జీపీటీసీ (GPTC) పరిధిలోకి సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, హైడ్రోజన్ పంపిణీ యంత్రాలు
* ఇకపై తూనికలు, కొలతల పరికరాల తనిఖీ మరింత పకడ్బందీ.. పెరిగిన జాబితా
న్యూఢిల్లీ, (రెడ్ బీ న్యూస్ ), మే 25 : దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్లలో సామాన్య వినియోగదారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ‘కొలతల్లో మోసం’. వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతూ సాగుతున్న ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, ఇంధన విక్రయాల్లో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. లీగల్ మెట్రాలజీ నిబంధనలను సవరిస్తూ ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది.
నిబంధనల సవరణ.. పరిధి విస్తరణ
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘లీగల్ మెట్రాలజీ (ప్రభుత్వ ఆమోదిత పరీక్షా కేంద్రం) నిబంధనలు - 2013’ కు తాజాగా సవరణలు చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆమోదిత పరీక్షా కేంద్రాల (Government Approved Test Centres - GPTC) పరిధిని భారీగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. మారుతున్న కాలం, సాంకేతికతకు అనుగుణంగా వినియోగదారుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.
జీపీటీసీలకే పూర్తి బాధ్యతలు
కొత్త సవరణల ప్రకారం.. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ (CNG), ఎల్‌పీజీ (LPG), ఎల్‌ఎన్‌జీ (LNG), మరియు భవిష్యత్ ఇంధనమైన హైడ్రోజన్ పంపిణీ యంత్రాల (Dispensers) ఖచ్చితత్వాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, ధృవీకరించే (Verification and Certification) పూర్తి బాధ్యతలను కేంద్రం జీపీటీసీలకు అప్పగించింది. ఇప్పటివరకు సాంప్రదాయ ఇంధనాలకే పరిమితమైన తనిఖీ పరిధిని.. ఇకపై సరికొత్త క్లీన్ ఎనర్జీ ఇంధనాలైన సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, హైడ్రోజన్ పంపిణీ యంత్రాలకు కూడా వర్తింపజేస్తూ జీపీటీసీ ఫ్రేమ్‌వర్క్‌లోకి చేర్చారు.
18 నుంచి 23కు పెరిగిన పరికరాల జాబితా
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో.. జీపీటీసీలు నిరంతరం నిఘా ఉంచి, ధృవీకరించే తూనికలు, కొలతల పరికరాల జాబితా సంఖ్య గతంలో ఉన్న 18 నుంచి 23కు పెరిగింది. దీనివల్ల బంకుల్లో యంత్రాల రీడింగ్‌లో తారుమారు చేయడం గానీ, తక్కువ ఇంధనం పోసి ఎక్కువ బిల్లులు వసూలు చేయడం గానీ సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విప్లవాత్మక మార్పుతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది వాహనదారులకు లీటరుకు లీటరు నమ్మకమైన ఇంధనం అందుతుందని, పంపిణీ వ్యవస్థలో పూర్తి పారదర్శకత నెలకొంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.







