UPDATED 8th NOVEMBER 2020 SUNDAY 8:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): ఏపీపీఎస్సీ గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల కౌన్సెలింగ్ ప్రక్రియను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రత్యేక పద్ధతి ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికైన 102 అభ్యర్థులకు స్థానిక కలెక్టరేట్ లోని విధాన గౌతమి హాలులో ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాలు, గ్రామ పంచాయతీలు, గ్రామ సచివాలయాల పరిధిలో గల ఖాళీల వివరాలు అభ్యర్థులకు అందచేయడంతో పాటు దివ్యాంగులు, మహిళలు, వివాహిత పురుషులు, వివాహం కాని పురుషులకు ర్యాంకులు, ఆప్షన్లు ఆధారంగా గ్రామ పంచాయతీలను కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సాధారణ బదిలీల్లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మైదాన ప్రాంతాలతో పోలిస్తే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అవసరం గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందని, ఆయా ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించి సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల పంపిణీ వ్యవస్థ ఎంతో పటిష్టమైందని, అక్కడ కూడా సమర్థవంతమైన పీవో, డివిజనల్, ఇతర అధికారులు పని చేస్తున్నారని అన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో కలిసి కలెక్టర్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఆర్. విక్టర్, తదితరులు పాల్గొన్నారు.