లఖ్‌నవూ (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: భారత్‌పై దాడి చేసేందుకు ఏ దేశమూ కన్నెత్తే సాహసము చేయకుండా ఉండేందుకే స్వదేశంలో బ్రహ్మోస్ క్షిపణి తయారు చేయాలనుకుంటున్నామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అంతేకానీ మరే దేశంపై దాడి చేసే ఉద్దేశంతో కాదని స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బ్రహ్మోస్ తయారీ కేంద్రంతోపాటు రక్షణ సాంకేతిక, ప్రయోగ కేంద్రానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి పాకిస్థాన్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘తాము తయారు చేస్తోన్న సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ (BrahMos)తోపాటు ఇతర అధునాతన రక్షణ ఆయుధాలు ఇతర దేశాలపై దాడి చేసేందుకు కాదు. ఇతర దేశాలపై దాడి చేయడం లేదా ఇతర దేశం నుంచి ఇంచు భూమి కూడా లాక్కునే స్వభావం భారత్‌కు ఎన్నడూ లేదు’ అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. బ్రహ్మోస్ క్షిపణిని భారత్ గడ్డపైనే తయారు చేయాలనుకుంటున్నామని పేర్కొన్న ఆయన.. తద్వారా చెడు ఉద్దేశంతో ఎవ్వరూ భారత్‌పై కన్నెత్తి చూసే సాహసం చేయలేరని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. భారత్‌పై ఆ దేశం ఎందుకు విరోధం కోరుకుంటుందో తెలియదన్నారు.







