అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022 : ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై రగడ జరుగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తూ ఆందోళన బాట పట్టారు. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. కాగా, కరోనా కారణంగా, విభజన వల్ల రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని, ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. సీఎస్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యున్నత స్థానంలో ఉండి రాష్ట్ర ఆదాయంపై అబద్దాలు ఆడుతున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. సీఎస్ సమీర్ శర్మ.. ప్రభుత్వం ఆడమన్నట్లు ఆడుతూ పేద అరుపులు అరుస్తున్నారని చెప్పారు. రెవెన్యూ, అప్పులు కలుకుని ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కంటే రూ.33,054 కోట్లు అధికంగా ఆదాయం ఉందని ఆయన వివరించారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.65,695 కోట్లు మాత్రమే ఉన్న సమయంలో 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని గుర్తు చేశారు.







