అవినీతి, అక్రమాలు నిరోధానికి సమాచారహక్కుచట్టం ఒక ఆయుధం

UPDATED 3rd DECEMBER 2017 SUNDAY 7:30 PM

పెద్దాపురం: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు, ప్రభుత్వాధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించేందుకు సమాచారహక్కు చట్టం ఒక ఆయుధంలాంటిదని సమాచారహక్కు చట్టం ప్రచార ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో మన పెద్దాపురం పేస్ బుక్ టీం, సమాచారహక్కు చట్టం ప్రచార ఐక్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వరహాలయ్యపేట యాసలపు సూర్యారావు భవనంలో సమాచారహక్కు చట్టంపై అవగాహనా సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా తూర్పుగోదావరి జిల్లా సమాచారహక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని అవగాహన చేసుకుని, రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాచారహక్కు చట్టాన్నివ్యక్తిగత అవసరాలకోసం కాకుండా సమాజహితం కోసం వినియోగించడం ద్వారా సత్ ఫలితాలు సాధించవచ్చన్నారు. సమాచారహక్కు చట్టం కార్యకర్త ఒక విజిలెన్స్ అధికారిగా ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడవచ్చన్నారు. ఎస్.ఎం.ఎస్ ప్రతినిధి ముక్తార్ ఆలీ మాట్లాడుతూ సమాచారహక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధంలాంటిదని, దీనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుతాయన్నారు. అవినీతిరహిత ప్రభుత్వ పాలన లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాల్సివుందని, సమాచారహక్కు చట్టంపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్ చల్లా విశ్వనాథం మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా వాటిని సక్రమంగా అమలుచేయడంలో అధికారులకు చిత్తశుద్ధి కొరవడిందన్నారు. సమాచారహక్కు చట్టంపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మన పెద్దాపురం పేస్ బుక్ టీం ప్రతినిధి పెదిరెడ్ల నరేష్, సమాచారహక్కు చట్టం ప్రచార ఐక్య వేదిక జిల్లా కార్యదర్శి వరలక్ష్మి, కోశాధికారి సునీల్, పెద్దాపురం-సామర్లకోట రోటరీ క్లబ్ కార్యదర్శి రావులపర్తి విజయ్, సామాజిక కార్యకర్త నాగిరెడ్డి వాసు, ఎ.పి.యూ.డబ్యు. జె. పెద్దాపురం నియోజకవర్గ అధ్యక్షుడు బూరాడ శ్రీనివాసరావు, ఆరిఫ్ ఆలీ, గవరసాన రాజశేఖర్, వంగలపూడి సురేష్, కొల్లి దుర్గాప్రసాద్, ఇనకొండ సత్యనారాయణ, రిటైర్డ్ వి.ఆర్.వో నాని, దొడ్డి రవి, మన పెద్దాపురం పేస్ బుక్ టీం సభ్యులు, ఎస్.ఎం.ఎస్ ప్రతినిధులు, ఎస్.ఎఫ్.ఐ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us