బెంగళూరు (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: ప్రభుత్వ కార్పొరేషన్లు, మండలి, సంస్థల్లో హిజ్రాలకు (ట్రాన్స్‌జెండర్) ఒక శాతం రిజర్వేషన్ వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు మంగళవారం ఆదేశించింది. చర్యల కోసం ప్రభుత్వానికి రెండు వారాల అవకాశాన్నిచ్చింది. లైంగిక అల్పసంఖ్యాకుల సంక్షేమం కోసం శ్రమిస్తున్న ‘సంగమ స్వయం సేవా సంస్థ’ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ పూర్తి చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. మరోవైపు పోలీసు రిక్రూట్‌మెంట్-2021 కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌లో ప్రత్యేక రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు హిజ్రాలు దరఖాస్తు చేసుకోవచ్చని కర్ణాటక పోలీసుశాఖ ప్రకటించింది.







