UPDATED 25th JULY 2017 TUESDAY 11:30 PM
*ఛలో అమరావతి పై ఉక్కుపాదం
*కిర్లంపూడి దారులన్నీ బంద్.. సాయుధ బలగాల కవాతు
*తూర్పు’ దిగ్బంధం.. పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ తనిఖీలు
*పాదయాత్ర చేసి తీరతామంటున్న ముద్రగడ.. సర్వత్రా ఉత్కంఠ
కిర్లంపూడి : గజానికో పోలీసు చెక్‌పోస్టు.. కిలోమీటర్‌కో బారికేడ్... అడుగడుగునా నిఘా.. వీధివీధినా ఖాకీల బూట్ల చప్పుళ్లు.. తుపాకులతో సాయుధ దళాల కవాతు.. చీమ చిటుక్కుమన్నా పసిగట్టే నిఘా నేత్రాలు.. నోటీసులు, అరెస్టులు, బైండోవర్ కేసులు.. ఇదీ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో పరిస్థితి. కాపు రిజర్వేషన్ల పోరాట సమితి కార్యక్షేత్రం కిర్లంపూడి యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. ‘కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులను బలహీన వర్గాల జాబితాలో చేర్చుతామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలను కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన స్వగ్రామమైన కిర్లంపూడి నుంచి బుధవారం ‘ఛలో అమరావతి’ పాదయాత్రకు సమాయత్తం అవుతున్నారు. ఆయన ఇలా పాదయాత్రకు పూనుకోవడం ఇది మూడోసారి. పాదయాత్రను అనుమతించే ప్రసక్తే లేదని ప్రభుత్వం, చేసి తీరుతామని కాపు నేతలు భీష్మించడంతో రాష్ట్రంలో ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం కిర్లంపూడిలో ఏమి జరుగనున్నదన్న ఉత్కంఠ నెలకొంది. ముద్రగడ తో సహా కాపు నేత ప్రముఖులందర్నీ ఇప్పటికే గృహ నిర్బంధం చేశారు. వేలాది మందిని అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసుల వలయంలో చిక్కుకుంది. సుమారు ఏడు వేలకుపైగా బలగాలతో జిల్లాను దిగ్బంధం చేశారు. జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు, పికెట్‌లు ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలుతో సహా వివిధ ప్రాంతాల్లో సెక్షన్ 144, 30ని ప్రకటించారు. నలుగురికి మించి గుమికూడకుండా, కలిసి నడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. పాదయాత్ర ప్రారంభమయ్యే కిర్లంపూడి గ్రామం పోలీసుల దిగ్బంధంలో ఉంది. భారీ ప్రత్యేక బలగాలతోపాటు ర్యాపిడ్ ఫోర్స్, తదితర బలగాలు ఎక్కడికక్కడ మాటు వేసి ఉన్నాయి. కిర్లంపూడికొచ్చే దారులన్నీదాదాపు మూసేస్తున్నారు. ఏదో ఒక ఐడీ కార్డు చూపిస్తే తప్ప ఆ గ్రామస్తులను కిర్లంపూడిలోకి రానివ్వడం లేదు. షెడ్యూల్ ప్రకారం 'ఛలో అమరావతి’ పాదయాత్రను బుధవారం ప్రారంభించేందుకు ముద్రగడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉద్యమానికి సహకరిస్తున్నవారందరికీ తమ అనుచరులు ద్వారా సమాచారం పంపించి అంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేసి తీరదామని సంకేతాలు పంపించారు. పోలీసులు వ్యూహ ప్రతి వ్యూహాలకు, ఎత్తుకు పైఎత్తులను గమనిస్తూ సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే కాపునేతలెవరూ కిర్లంపూడి రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎవరైనా కాపు నేత కిర్లంపూడికి వస్తే ఆ డివిజన్ సూపరింటెండెంట్, సీఐ, ఎస్‌ఐలే బాధ్యులవుతారని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది.







