తిరుపతి (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ తిరుపతి సమీపంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సభ జరగనుంది. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ప్రకటించాయి. మరోవైపు రైతుల సభ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తిరుపతి సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. తిరుపతిలోనూ పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయి. భాకరాపేట నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి నియంత్రిస్తున్నారు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు తిరుపతి రాకుండా అడ్డుకుంటున్నారు. చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత కారును పోలీసులు సీజ్ చేయడంతో ఆమెతో పాటు పలువురు తెదేపా నేతలు బస్సులో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభకు వచ్చేవారిని పోలీసులు అడ్డుకోవడంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభకు వచ్చేవారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేస్తామని అమరావతి ఐకాస నేతలు స్పష్టం చేస్తున్నారు.







