UPDATED 5th JULY 2017 WEDNESDAY 10:00 AM
విజయవాడ : అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరానికి అధికారికంగా గుర్తింపు లభించింది. దీంతో ఇక్కడ నుంచి విదేశాలు వెళ్లడానికి మార్గం సుగమైంది. అదేవిధంగా వివిధ దేశాల్లో ఉన్న వారు మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శించడానికి అవకాశం ఏర్పడింది. ఆయా పర్యాటకులను ఆకర్షించే క్రమంలో భాగంగా పర్యాటకశాఖ 15 అడుగుల అంబారీ ఏనుగు ప్రతిమను విమానాశ్రమయంలో ప్రతిష్ఠించడానికి సన్నాహాలు చేస్తోంది. హస్తకళాకారులను ప్రోత్సహించడంతో పాటు రాజుల కాలం నాటి విశేషాలను తెలియజేసే విధంగా దీనిని ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ సుమారు రూ.15 లక్షలు కేటాయించింది. దీనిని విజయవాడలోని విక్టోరియా మ్యూజియంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన కొయ్యబొమ్మల తయారీ దారుడు పనబాకం రంగాచారి ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. ఈ నెలఖారు కల్లా దీనిని సిద్ధం చేస్తామని రంగాచారి తెలిపారు. అందంగా, ఆకర్షణీయంగా, పర్యాటకులను ఆకర్షించేలా ఐదు అడుగుల వెడల్పు, 14 అడుగుల పొడవుతో, 10 అడుగులు ఎత్తులో ఏనుగు ప్రతిమ ఉంటుంది. లోపల వైపు ఇనుపబద్దీలు వేసి అమర్చారు. దానిపై బర్మా టేకు కలప వేసి రూపొందిస్తున్నారు. అంబారీ ఐదు అడుగులు ఎత్తు ఉంటుంది. అంబారీలో ఇద్దరు రాజులు, ముందు భాగంలో ఏనుగును నడిపే సారథి ఉంటాడు. దీనిని ప్రధాని నరేంద్రమోదీచే ప్రారంభింపజేసేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.







