అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1020 కిలోమీటర్లు, పారాదీప్‌కు ఆగ్నేయంగా 1060 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది మరింత పశ్చిమ వాయువ్యదిశగా కదులుదూ శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా-ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో రేపటి నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు. ప్రత్యేకించి ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి అని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.







