UPDATED 9th JUNE 2017 FRIDAY 8:00 PM
కాకినాడ: జిల్లాలోని అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై రహస్య గూఢచర్య కార్యకలాపాలు నిర్వహించి పిండ, లింగ నిర్ధారణ వెల్లడి చేసిన స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కోర్ట్ హాల్లో గర్భస్థ, పిండ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా రిజిస్టర్ చేసుకున్నఆరు అల్ట్రా సౌండ్ సౌండ్ స్కానింగ్ సెంటర్లకు అనుమతులు, 19 సెంటర్లకు లైసెన్స్ రెన్యువల్, 10 సెంటర్లకు అడ్రస్ మార్పు అనుమతులకు రాటిఫికేషన్ జారీ చేశారు. ఆడ శిశువుల పట్ల వివక్షతో జరిగే భ్రూణ హత్యల నివారణకు తెచ్చిన గర్భస్థ పిండ, లింగ పరీక్షల నిషేధ చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలన్నారు. పిండ ఆరోగ్య రక్షణ కోసం నిర్దేశించిన అల్ట్రా సౌండ్ పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం చేసే స్కానింగ్ సెంటర్లపై రహస్య నిఘా ఉంచి డెకోయ్, స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించాలని పిండ, లింగ నిర్ధారణ చేసి వెల్లడించే సెంటర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ప్రతీ స్కానింగ్ సెంటర్లో గర్భిణి మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టవలసిన కనీస సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని స్కానింగ్ చేసే ముందు గర్భిణి అనుమతి సంతకాన్ని సెంటర్లలో తప్పనిసరిగా సేకరించాలన్నారు. ఈ అనుమతి పత్రాలు, కేంద్రం రిజిస్ట్రేషన్ లైసెన్స్, స్కానర్ వివరాలు పరీక్ష నిర్వహించే వైద్యులు నిపుణుల వివరాలు విధిగా ఆన్ లైన్ లో పరిశీలనకు అందుబాటులో ఉండాలన్నారు. లైసెన్స్ పునరుద్ధరించుకోదలిచిన సెంటర్ కనీసం 60 రోజులు ముందు అందుకు దరఖాస్తు చేసుకోవాలని నిర్దేశించారు. ఆర్డీవోలు, ప్రొగ్రామ్ అధికారులు తమ పరిధిలో అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు ముమ్మరంగా నిర్వహించి నిబంధనలు ఉల్లఘించిన సెంటర్లపై కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆరవ అదనపు జిల్లా జడ్జి ఎం.శ్రీనివాసాచారి, ఐటిడిఎ పీవో దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ -2 జె.రాధాకృష్ణమూర్తి, డి ఎం హెచ్ వో కె. చంద్రయ్య, ఆర్డీవోలు విశ్వేశ్వరరావు, రఘుబాబు, గణేష్ కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎన్ జి వో ప్రతినిధులు పాల్గొన్నారు.







