UPDATED 16th JUNE 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానం, నీలమ్మ చెరువు మసీదు వద్ద జరిగిన రంజాన్ ప్రార్థనల్లో శనివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ 2014 -18 వరకు మైనార్టీల సంక్షేమం కోసం అధిక నిధులను బడ్జెట్లో ప్రవేశపెట్టి వారికి అవసరమైన సంక్షేమ పథకాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం పేద ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా పథకాన్ని అమలు చేస్తున్నామని, ఇమామ్స్, మౌజామ్స్ కోసం గౌరవ వేతన పథకం ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. పేద ముస్లిం వధువులకు వివాహ నిమిత్తం దుల్హన్ పథకం క్రింద రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు. అవసరాల మేరకు షాదీఖానాలు నిర్మిస్తున్నామని, ఇందులో భాగంగా స్థానికంగా రూ. ఐదు లక్షలతో షాదీఖానాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచమంతటా ముస్లింలు రంజాన్ మాసాన్ని పవిత్రమాసంగా భావించి ఉపవాసం ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ వేడుకలు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. అల్లా దయతో రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలని ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని భగవంతుని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, గుమ్మళ్ల రామకృష్ణ, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, తహసీల్దార్ ఎల్. శివకుమార్, పోలిపల్లి బాబివర్దన్, మసీదు గురువు ఇర్ఫాన్ రబ్బానీ జమియతుల్ ఖురేషి, సాహారి జమియత్ అహాలేనుదీస్, అబ్దుల్ తవ్వాబ్, రహమత్, తాహెర్, హబీబుల్లా, ఇమాం ముజఫర్, ప్రెసిడెంట్ గౌస్, సెక్రెటరీ హాజీ బహద్దూర్, షేక్ యాసిన్, మౌలానా, ఎండి షఫీయుల్లా, అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.







