UPDATED 4th NOVEMBER 2017 SATURDAY 6:30 PM
పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో భారత్ గ్యాస్ మొబైల్ యాప్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా స్థానిక రాజుగారి వీధిలో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణమండపంలో లలితా గ్యాస్ ఏజెన్సీస్ అధినేత మండవిల్లి శ్రీనివాస ముత్యాలు ఆధ్వర్యంలో భారత్ గ్యాస్ మొబైల్ యాప్ ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ భారత్ గ్యాస్ వినియోగదారులకు సౌలభ్యంగా ఈ మొబైల్ యాప్ ను రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు డిజిటల్ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. ప్రతీ కుటుంబానికి గ్యాస్ సదుపాయం కల్పించి పొగరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా ప్రజలు మరింత సులువుగా భారత్ గ్యాస్ సేవలను పొందవచ్చన్నారు. లలితా గ్యాస్ ఏజెన్సీస్ అధినేత శ్రీనివాస ముత్యాలు మాట్లాడుతూ తమ వినియోగదారుల సౌకర్యం కోసం ఈ మొబైల్ యాప్ ను భారత్ గ్యాస్ రూపొందించినట్లు చెప్పారు. అలాగే వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడమే తమ లక్ష్యం అన్నారు. భారత్ గ్యాస్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా ఆన్ లైన్ పేమెంట్, నగదురహిత లావాదేవీలు, రీఫిల్ బుకింగ్, అత్యవసర సేవలు, మొబైల్ నెంబర్ మార్చుకునే సౌలభ్యం కలుగుతుందన్నారు. అలాగే ఫిర్యాదులు, సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా వినియోగదారులకు ఇంటివద్ద నుంచి ఫోన్ చేసి భారత్ గ్యాస్ సేవలను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, లలితా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మట్టే శ్రీనివాస్, అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు మట్టే సత్యప్రసాద్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొరుపూరి రాజు, ఆత్మా ఛైర్మన్ కలకపల్లి రాంబాబు (రాము), పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు రంధి సత్యనారాయణ (సత్తిబాబు), కొత్త వీరన్న, మండల టీడీపీ కార్యదర్శి జివివి వీర్రాజు, భారత్ గ్యాస్ వినియోగదారులు, పాల్గొన్నారు.







