UPDATED 15th OCTOBER 2022 SATURDAY 08:00 PM
▪️ ముగిసిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు
TTD : హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో చివరి రోజు శనివారం శ్రీనివాస కల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. హైదరాబాద్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఐదు రోజుల పాటు జరిగిన వైభవోత్సవాలు కల్యాణఘట్టంతో వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్, ఈఓ ఎవి.ధర్మారెడ్డి, దాతలు హర్షవర్ధన్, ఎస్‌ఎస్.రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
సాయంత్రం 6.30 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మధుపర్క సమర్పణ, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా కల్యాణంలోని ఆయా ఘట్టాలకు అనుగుణంగా టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్, అన్నప్రాజెక్టు కళాకారిణి బుల్లెమ్మ కలిసి పలు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా గానం చేశారు.
శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన వేలాది మంది భక్తజనం చేసిన గోవిందనామ స్మరణతో స్టేడియం మార్మోగింది. అంతకుముందు సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకార సేవలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు. రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు తోమాల సేవ, అర్చన, నివేదన నిర్వహించారు.







