నారాయణగూడ (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: స్నేహం ముసుగులో ఒకరు.. లోన్ ఇస్తామని మరొకరు మొత్తం రూ.9 లక్షలు కాజేశారని ఓ బాధితుడు సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్‌కు చెందిన ఓ యువకుడు ‘గ్రిండర్’ అనే ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో లాగిన్ అయ్యాడు. అతడికి అమెరికాకు చెందిన డా.రాండి అమెస్ట్రాన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. యూఎస్‌లో తనకు ఓ ఆసుపత్రి ఉందని చెప్పాడు. ఇద్దరూ స్నేహితులయ్యారు. నాలుగు నెలలుగా ఛాటింగ్ చేసుకుంటున్నారు. ఓ రోజు డా.రాండి తాను భారత్‌కు వస్తున్నాని, స్నేహానికి గుర్తుగా ఖరీదైన బహుమతి తీసుకొస్తున్నానని సదరు యువకుడికి చెప్పాడు. రెండో రోజే దిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారులమంటూ గుర్తుతెలియని వ్యక్తులు యువకుడికి ఫోన్ చేశారు. డా.రాండి పెద్ద ఎత్తున డాలర్లు, బంగారు నగలు, ఇతరత్రా వస్తువులతో వచ్చాడు. విచారిస్తే మీ కోసమే ఆ వస్తువులు తీసుకొచ్చినట్లు చెప్పాడు. అతడిని వదలాలంటే కస్టమ్స్, ఇన్‌కంటాక్స్, జీఎస్టీ కలిపి మొత్తం రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అంతే.. యువకుడు ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేశాడు. ఆ తర్వాత స్నేహితుడు లేడు.. బహుమతులూ రాలేదు. ఇదే యువకుడు రూ.3 లక్షల లోన్ అవసరమై ‘అప్‌స్టేర్ హింద్ లోన్’ యాప్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా కొంత డిపాజిట్ చెల్లిస్తే లోన్ ఇస్తామని అవతలి వ్యక్తులు మొదట రూ.2.17 లక్షలు.. తర్వాత ఏవో సాకులు చెప్పి మరో రూ.3 లక్షలు బదిలీ చేయించుకున్నారు. లోన్ రాక డబ్బులూ తిరిగివ్వకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.







