సచివాలయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

* ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య

UPDATED 10th JUNE 2020 WEDNESDAY 5:30 PM

దేవీపట్నం(రెడ్ బీ న్యూస్): గ్రామ సచివాలయాలలో పూర్తిస్థాయిలో నిర్దేశిత కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడంతో పాటు తమ పరిధిలోని కుటుంబాలకు గ్రామ సచివాలయం ద్వారా చేపట్టే కార్యక్రమాల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య గ్రామ వాలంటీర్లు, మండల అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని ఇందుకూరు, ఇందుకూరుపేట గ్రామాలలో ఆయన బుధవారం పర్యటించారు. ముందుగా ఇందుకూరుపేట గ్రామ సచివాలయాన్ని సందర్శించి కార్యాలయ భవనం బాగోలేదని వేరే భవనాన్ని గుర్తించాలని మండల అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయం ద్వారా అందే సేవలు ధ్రువపత్రాలు జారీ, సంక్షేమ ఫలాలు పొందడం వంటి వాటిపై కూడా ముందు గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లుకు తెలిపి వాటిని ప్రజలలోనికి తీసుకొని వెళ్లే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఇందుకూరు ఎంపిపి పాఠశాలను సందర్శించి పనులు నిర్వహణ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలు పున: ప్రారంభం నాటికి నాడు-నేడు పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఇందుకూరు పేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. గర్భం దాల్చిన ప్రతీ గర్భిణీ స్త్రీని నమోదు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే పోషకాహరలేమిని సరిదిద్దేందుకు అంగన్వాడీ కేంద్రాలలో కూడా పేరు నమోదు చేసి పోషకాహారాన్ని అందించేందుకు స్త్రీ,శిశు సంక్షేమశాఖ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరువురు సమస్వయంతో మాతా శిశు మరణాలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అనంతరం పెదభీంపల్లి గ్రామంలో ఉద్యాన సాగు క్షేత్రాలను ఆయన సందర్శించి ఏ పంటలకు భూమి అనువుగా ఉందో అధికారులు రైతులకు తెలియచేసి ఆయా పంటల సాగును ఉపాధి హామీ అనుసంధానం చేసుకునేలా తోడ్పాటు అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్. పిచ్చమ్మ, తహసీల్దార్ వీర్రాజు, ఎంఈవో వీరభద్రరావు, డిఈ గౌతమి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us