స్వచ్ఛ తూర్పుగోదావరి జిల్లా సాధనే లక్ష్యంగా వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటం

* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

UPDATED 7th DECEMBER 2020 MONDAY 6:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): స్వచ్ఛ తూర్పుగోదావరి జిల్లా సాధనే లక్ష్యంగా వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమాన్ని గ్రామగ్రామాన ఉద్యమస్థాయిలో చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 7 నుంచి  21వ తేదీ వరకూ పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రజల భాగస్వామ్యంతో వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం పేరిట నిర్వహిస్తున్న పరిశుభ్రతా పక్షోత్సవాలను స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రతే జీవన పురోగతికి, నాగరిక వికాసానికి నిజమైన సూచికని, ప్రకృతి ప్రసాదించిన అపురూప సంపదలైన గాలి, నీరు, పర్యావరణాల స్వచ్ఛతను పరిరక్షించాల్సిన బాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రజా భాగస్వామ్యంతో రాష్ట్రంలో పరిశుభ్ర సమాజ స్థాపనకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఇందులో భాగంగా ఈ నెల 7 నుంచి  21వ వరకూ నిర్వహిస్తున్న వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం పక్షోత్సవాల ద్వారా ప్రజలలో పారిశుధ్యం పట్ల అవగాహన  పెంపొందించి, పరిశుభ్రత నిత్య జీవన శైలిగా పాటించేలా చైతన్య పరచాలని అధికారులను కోరారు. ప్రతీ మండల పరిధిలో సుమారు 15 వందల నుంచి రెండు వేల మంది వలంటీర్లు ప్రజల ముంగిటికి వెళ్లి ప్రభుత్వ సుపరిపాలనా ఫలాలను అందిస్తున్నారని, వారిని పారిశుధ్య ఉద్యమాల్లో సుశిక్షిత సైన్యంలా వినియోగించుకోవాలని అన్నారు. అన్ని రంగాల్లో ప్రగతి, అన్ని వర్గాల సంక్షేమంలోను అగ్రగామిగా ముందుకు సాగుతున్న తూర్పు గోదావరి జిల్లాను పరిశుభ్రతలోను ఆదర్శ జిల్లాగా నిలిపేందుకు ప్రజలందరూ సమిష్టిగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ డి. మురళీధరరెడ్డి మాట్లాడుతూ 2014 అక్టోబరు 2వ తేదీన ప్రధానమంత్రి ఇచ్చిన స్వచ్ఛభారత్ పిలుపుతో దేశవ్యాప్తంగా పారిశుధ్య ఉద్యమం కొనసాగుతోందని, ఈ దిశగా ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. వ్యర్థాలపై వ్యతిరేక ఉద్యమంలో విజయం సాధించాలంటే ముందు ప్రజలు వ్యర్థాలను తగ్గించాల్సిన అవసరం ఉందని, వ్యర్ధాలను రీసైక్లింగ్ చేసి పునర్వినియోగంలోకి తేవడం ద్వారా 90 శాతం వ్యర్ధాలను నియంత్రించవచ్చని తెలిపారు. వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం పక్షోత్సవాల్లో జిల్లా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం వ్యర్థాలపై వ్యతిరేక పోరాట నినాదాలతో విద్యార్థులు, మహిళా, యువజన సంఘాలు, స్వచ్చంద సంస్థలు, ఉద్యోగుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్, ఇంద్రపాలెం, పాత బస్టాండ్, అంబేద్కర్ భవన్ ప్రాంతాల మీదుగా నిర్వహించిన భారీ ర్యాలీని మంత్రి జండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జిల్లా పరిషత్ సీఈవో ఎన్.వి.వి. సత్యన్నారాయణ, డిప్యూటీ సీఈవో పి. నారాయణమూర్తి, జిల్లా పంచాయితీ అధికారి ఆర్. విక్టర్, డివిజనల్ డవలప్ మెంట్ అధికారులు, ఎంపీడీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us