వైద్య పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు

UPDATED 16th JUNE 2017 FRIDAY 7:00 PM

తొండంగి : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఏ.వి.నగరం గ్రామంలో రూ.1.85 లక్షలు వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించి అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి కేబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగిందని, స్థానికులకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నియామకాలను త్వరలో చేపడతామని తెలిపారు. వైద్య వసతుల అభివృద్ధిలో భాగంగా తుని, తణుకు పట్టణాలలో ఒక్కొక్కటి రూ.8.50  కోట్ల అంచనాతో రెండు మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్ లు నిర్మిస్తామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టిన సంస్కరణల వల్ల రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపి స్థాయి ముప్పై ఏడు శాతం మేరకు, సురక్షిత ఆసుపత్రి ప్రసవాలు పన్నెండు శాతం మేర పెరిగాయన్నారు. అన్ని ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించామని, రోగులకు ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1180 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 84 కేంద్రాలకు మరమత్తులు చేపట్టామని చెప్పారు. అనంతరం హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్వగ్రామమైన ఏ.వి. నగరం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందని, అలాగే ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గోపినాథ్ మాట్లాడుతూ ఏ.వి.నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించడం జరిగిందన్నారు. భవన నిర్మాణానికి రూ.1.15 లక్షలు, వైద్య పరికరాల కోసం రూ.10 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయగా మరో రూ.40  లక్షల నిధులను యనమల ఫౌండేషన్ సామాజిక హిత కార్యక్రమాల కింద సమకూర్చిందన్నారు. గ్రామంలో రూ.25  లక్షలు జెడ్పి నిధులు, యనమల ఫౌండేషన్ సమకూర్చిన విరాళ నిధులతో నూతనంగా నిర్మించిన జ్ఞాన మందిరం, గ్రంథాలయాన్ని హోం మంత్రి ప్రారంభించారు. అలాగే మంత్రులు 130 మంది బాలికలకు సైకిళ్లను పంపిణి  చేశారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపి తోట నరసింహం, శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, జెడ్పి చైర్మన్ నామన రాంబాబు, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎస్.వర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు, జాయింట్ కలెక్టర్ -2 రాధాకృష్ణమూర్తి, డిసిహెచ్ఎస్ రమేష్ కిషోర్, డీఎంహెచ్వో  చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us