Updated 18th April 2017 Tuesday 10:00 PM
సామర్లకోట: రాష్ట్రంలో రానున్న రెండు సంవత్సరాలలో ప్రతీ గ్రామానికి పరిశుభ్రమైన త్రాగునీరు అందించడమే టిడిపి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐ టి , పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం జి.మేడపాడు గ్రామంలో ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భం గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పంచాయతీ రాజ్ స్వశక్తీకరణ పురస్కారం అందుకున్న జి.మేడపాడు గ్రామం రాష్ట్రానికే ఆదర్శమన్నారు. గ్రామంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, వర్మీ కంపోస్ట్ యూనిట్లను ఆయన పరిశీలించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథం దిశగా తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ప్రతీ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ మంత్రి గా పదవీ భాద్యతలు చేపట్టిన లోకేష్ తన తొలి పర్యటనను పెద్దాపురం నియోజకవర్గంలోని జి.మేడపాడు గ్రామాన్ని ఎంచుకోవడం ఆనందం కల్గించిందన్నారు. నారా లోకేష్ హయాంలో గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగడం తథ్యం అన్నారు. అనంతరం లోకేష్ ను గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పెద్దాపురం - జగ్గంపేట ప్రధాన రహదారి లో ఉన్నశతాబ్ధి పార్క్ ను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ హెచ్. అరుణ్ కుమార్, కాకినాడ ఎంపీ తోట నరసింహం, రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జెడ్పి చైర్మన్ నామన రాంబాబు, శాసన మండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, రవి వర్మ, ఆదిరెడ్డి అప్పారావు, పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ చైర్మన్ లు రాజా సూరిబాబు రాజు, మన్యం పద్మావతి చంద్రరావు, జెడ్పిటిసి గుమ్మళ్ల విజయలక్ష్మి రామకృష్ణ , మార్కెట్ కమిటీ చైర్మన్లు ముత్యాల రాజబ్బాయి, పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, పెద్దాపురం, సామర్లకోట ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్లు బొడ్దు బంగారుబాబు, ఏ. కుమారస్వామి, ఎంపిపి మార్త, అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.







