UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 01:30 AM
● అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం తిలకించిన భక్తులు..
● హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు
అంతర్వేది (రెడ్ బీ న్యూస్): నవ నారసింహ క్షేత్రాల్లో అగ్రగామి అయిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కల్యాణోత్సవ శోభతో వెల్లివిరిసింది. వేద మంత్రోచ్చారణలతో సకల దేవతల ఆశీర్వచనాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామివారు ఉభయ దేవేరులైన భూదేవి, శ్రీదేవిలను కల్యాణమాడారు. శ్రీ వైఖానస ఆగమానుసారం వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆలయ స్థానాచార్యులు వింజమూరి రామరంగాచార్యులు, ప్రధాన అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్ వారి సమక్షంలో అర్చక బృందం పేరూరు ఉద్దండ పండితులు కల్యాణాన్ని నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో సాగిన ఈ కల్యాణతంతును భక్తులు తన్మయత్వంతో చూసి తరించారు.
అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కల్యాణం శుక్రవారం రాత్రి 12.35 గంటలకు మృగశిర నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో జరిగింది. శుభ ముహూర్తానికి జీలకర్ర, బెల్లం స్వామివారి శిరస్సుపై ప్రధాన అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల శిరస్సులపై సహాయ అర్చకులు ఉంచారు. ఆలయం ఎదురుగా నిర్మించిన శాశ్వత షెడ్లలో భక్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆశీనులై స్వామివారి కల్యాణం వీక్షించారు. తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణం తిలకించారు.
సుమారు నాలుగు గంటలపాటు సాగిన స్వామివారి కల్యాణం భక్తులు ఆద్యంతం వీక్షించారు. స్వామివారి కల్యాణం పురస్కరించుకుని స్వామి వారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఉచిత దర్శనం కోసం ఎదురుచూశారు. ఇక రాత్రి 9 గంటలకు ఎదురు సన్నాహంతో కల్యాణ తంతు ప్రారంభమైంది. అనాధిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ఆలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబరు రామగోపాల రాజా బహద్దూర్ శ్రీవారి తరపున, అర్చక స్వాములు అమ్మవారి తరపున వివాహకర్తలుగా వ్యవహరించారు.
ఆలయం నుంచి తొలుత స్వామివారిని తర్వాత అమ్మవార్లను వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అర్చకులు, అధికారులు పల్లకీలో వేర్వేరుగా కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. శ్రీవారు, అమ్మవార్లకు అంతర్వేదికరకు చెందిన డాక్టర్ పోతురాజు సూర్యవెంకట సత్యనారాయణ కుటుంబీకులు గతంలో ఇచ్చిన ఆభరణాలను అర్చకులు అలంకరించారు. కల్యాణం నిర్వహణలో ఆనవాయితీ ప్రకారం పేరూరు వేద పండితులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి తలంబ్రాలను పొలమూరి కుటుంబీకులు తీసుకువచ్చారు.
కల్యాణానికి ముందు దేవస్థానం తరపున ఆలయ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధు లుగా మంత్రి చెల్లుబోయిన వేణు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, ఎంపీ చింతా అనురాధ, మొగల్తూరు రాజావారు ఆలయ ఫౌండర్ రామగోపాల రాజాబహద్దూర్, ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంత రాయు డు, ఆలయ అధికారులు, భక్తులు శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.







