గువాహటి (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: అసోంలోని ధుబ్రి జిల్లాలో ఏనుగు దాడి చేయడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తమర్‌హాట్ ప్రాంతంలో జనవాసాల్లోకి చొరబడిన ఏనుగు అక్కడున్న ప్రజలను తరమడం ప్రారంభించింది. ఊర్లోకి వచ్చిన ఏనుగును చూసి స్థానికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఆ క్రమంలో 30ఏళ్ల వ్యక్తి కింద పడిపోయాడు. వెంటనే ఏనుగు అతడిని గాయపరిచింది. తొండంతో ఈడ్చిపడేసింది. దూరంగా ఉన్న స్థానికులు అరుపులతో ఎంత భయపెట్టినా బెదరలేదు. తర్వాత గజరాజు అక్కడి నుంచి వెళ్లిపోగా.. యువకుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని అటవీశాఖ అధికారి వెల్లడించారు. స్థానికులపై దాడిచేసిన ఏనుగు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు అధికారులు వివరించారు.







