UPDATED 31st AUGUST 2017 THURSDAY 6:00 PM
పెద్దాపురం: పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు బస్ పాస్ సౌకర్యం కల్పించి వారికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక బస్ కాంప్లెక్స్ లో విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా గురువారం బస్ పాస్ లను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినీ విద్యార్థులకు ఈ బస్ పాస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు విద్యార్థులు కంట్రిబ్యూషన్ గా చెల్లించాల్సిన వంద రూపాయలను లలితా ఇండస్ట్రీస్ యాజమాన్యం చెల్లించేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆర్టీసీ డిఎమ్ పి.భాస్కరరావు మాట్లాడుతూ పెద్దాపురం మండలానికి సంబంధించి విద్యార్థినీ, విద్యార్థులకు 1500 బస్ పాస్ లు, ఏలేశ్వరం పట్టణానికి 500 బస్ పాస్ లు కంట్రిబ్యూషన్ ను లలితా ఇండస్ట్రీస్ యాజమాన్యం సహకారంతో అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పాస్ లు 20 కిలోమీటర్లు లోపు ఉపయోగ పడతాయని, కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, లలితా ఇండస్ట్రీస్ అధినేత మట్టే శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, ఆర్టీసీ ఆర్ ఎం సి.హెచ్. రవికుమార్, డిప్యూటీ సిటిఎం నాగేశ్వరావు, ఎంపిపి గుడాల రమేష్, జెడ్పిటిసి సుందరపల్లి శివనాగరాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్ గోకిన ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.







