తిరుపతి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021 : రాష్ట్రంలో సీజ్ చేసిన థియేటర్లకు ప్రభుత్వం నెల సమయం ఇవ్వడం సంతోషకరమని, అందరి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘ఎగ్జిబిటర్లుగా మా తప్పులూ కొన్ని ఉన్నాయి. సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని భావిస్తున్నాం. అన్ని పత్రాలు సమర్పించినా అధికారులు అనుమతి ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం మాకు మరింత సహకరించాలి. తెలుగు సినిమాకు ఇప్పుడు దేశ వ్యాప్త ఖ్యాతి ఉంది. కరోనా నుంచి డిసెంబరులోనే కాస్త కుదుటపడుతున్నాం. మల్టీప్లెక్స్‌లలోనే తిను బండారాల ధరలు అధికంగా ఉన్నాయి. టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. నవరత్నాలతో పాటు ఈ వ్యవస్థను కూడా సీఎం కాపాడాలి. విధానపరమైన నిర్ణయాలపై స్పష్టత లేకపోవడం వల్లే ఈసమస్య ఇంత వరకు వచ్చింది’’ అని ఎన్వీ ప్రసాద్ పేర్కొన్నారు.







