పెద్దాపురం : పార్టీ ఫిరాయించిన వారికి తెలుగుదేశం పార్టీ మంత్రి పదవులను కట్టబెట్టడంపై వైయెస్సార్ సిపి నాయకులు పట్టణంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. వైయెస్సార్ సిపి పెద్దాపురం నియోజకవర్గ కన్వీనర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట వైయెస్సార్ సిపి కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ధర్నాను ఉద్దేశించి సుబ్బారావునాయుడు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సేవ్ డెమోక్రసీ పేరుతో ధర్నా కార్యక్రమాలు చేపట్టినట్లు అయన పేర్కొన్నారు. ప్రజలు జరిగేదంతా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అన్నారు. ఈకార్యక్రమానికి ముందుగా వైయెస్సార్ సిపి నాయకులూ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమం లో ఆవాల లక్ష్మి నారాయణ , రాష్ట్ర కార్యదర్శి కంటే వీరరాఘవరావు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.







