UPDATED 20th AUGUST 2018 MONDAY 6:30 PM
రంపచోడవరం: దేవీపట్నం మండల పరిధిలోని గోదావరి వరద ముంపు బారినపడిన గ్రామాలలో వరద బాధితుల సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు ఐటిడిఎ పివో నిషాంత్ కుమార్ అన్నారు. ఐటిడిఎ సమావేశ మందిరంలో కంట్రోల్ నుంచి సోమవారం ఆయన మాట్లాడుతూ భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద మూలంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలుకు సిద్ధం కావాలని ఆదేశించారు. వరద భాదితులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు సెక్టారు అధికారుల ద్వారా చేపట్టామన్నారు. ప్రసవ తేదీలు ఆధారంగా గర్బిణీలను గుర్తించి వారిని ముందుగానే ఆయా ఆసుపత్రులలోని బర్త్ వెయిటింగ్ హాళ్లకు తరలిస్తున్నామని, వారికి వైద్య సహాయంతో పాటు భోజన వసతి కూడా కల్పించి అన్నిచర్యలు చేపట్టామన్నారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు స్థానికంగా ఏర్పాటు చేసిన 24 గంటల కంట్రోల్ రూము నుంచి పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని అన్నిరకాలుగా సహాయకచర్యల కొరకు సిద్దపరుస్తూ మోనటరింగ్ చేస్తున్నామన్నారు. కచ్చులూరు కొండమొదలు, మూలపాడు, అగ్రహారం తదితర గ్రామాలలో అదనంగా పాలు, బాలామృతం, గుడ్లు, త్రాగునీరు, వంటనూనెలు సరఫరా చేస్తున్నామని, తోయ్యేరు, వీరవరం, అంగళూరులలో పునరావాస కేంద్రాలకు మధ్యాహ్నాం భోజన ప్యాకెట్లు 1000 వరకు అందించామన్నారు. 3,4,5 సెక్టారులలో వరద ప్రభావం ఉందని, ఆయా సెక్టార్ అధికారులతో ఎప్పటికప్పుడు సహాయకచర్యలుపై ఆరా తీస్తూ వారి అవసరాల మేరకు సహాయక చర్యలు చేపడుతున్నామని అన్నారు. వాగులు దాటేటప్పుడు గిరిజనులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని, కొన్నిచోట్ల ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులవద్ద ప్రమాదాల నివారణ కొరకు పోలీస్ పికెటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తామన్నారు. కొండమొదలులో మూడు వైద్య శిబిరాలు, మంటూరు సెక్టారులో మరో వైద్య శిబిరం నడుస్తున్నాయన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్దరణ కొరకు డబుల్ సేఫ్టీ విధానంలో చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటివరకు తోయ్యరు వరకు విద్యుత్ సరఫరాను పునరుద్దరించడం జరిగిందన్నారు. తోయ్యరు గ్రామంలో 18 కుటుంబాలకు చెందిన 63 మంది పునరావాసం పొందుతున్నారని, ఒక్కొక్క కుటుంబానికి ఒక లీటరు కిరోసిన్ వంతున సరఫరా చేయడం జరిగిందన్నారు. వరద ప్రవాహ స్థాయిలను బట్టి కిరోసిన్ రేషనలైజేషన్ ప్రకారం అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపివో పివిఎస్ నాయుడు, ఇఇ పి.కె నాగేశ్వరరావు, డిఎంవో ఎం. తులసి, జిసిసి డిఎం రాజన్ రాజు, సబ్ డిఎఫ్ శామ్యూల్, తహసీల్దార్ కె. లక్ష్మీకళ్యాణి, ఆర్అండ్ బి డిఇ పి.ఎస్.వి లక్ష్మీ, జెడిఎం గీత, ఆర్ డబ్ల్యుఎస్ డిఇ ఎం.వి. కృష్ణారావు, ఎపివో రబ్బరు పి. వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు.







