UPDATED 21st FEBRUARY 2022 MONDAY 06:45 AM
Pawan Kalyan Narsapuram: జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారా? మార్చి 14న ఆయన ఏం చెప్పబోతున్నారు? పార్టీని ప్రజలకు దగ్గర చేసేలా ఎలాంటి ప్రణాళికలు రచింబోతున్నారు? ఏపీలో ఇప్పుడివే సందేహాలు మొదలయ్యాయి. నర్సాపురం మత్య్సకార అభ్యున్నతి సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో మరింత హీట్ పుట్టించాయి. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో మళ్లీ కలుద్దాం.. ఎలా యుద్ధం చేయాలి? ఎన్నికలకు ఎలా సంసిద్ధులం కావాలనే దానిపై చర్చిద్దామని అనడంతో.. పవన్ ఏం చెప్పబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది.
నర్సాపురంలో జనసేన మత్స్యకార అభ్యున్నత సభ నిర్వహించింది. ఈ సభకు మత్య్సకారులతో పాటు జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. లేని సమస్యలు సృష్టించడంలో వైసీపీ నేతలు ఉద్దండులని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. రాష్ట్రంలో 65 నుంచి 70లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని.. లక్షల మంది పొట్టకొట్టే విధంగా ప్రభుత్వం జీవో 217 తీసుకొచ్చిందన్నారు. జనసేనకు పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే జీవో 217 జీవోను చించిపారేసే వాళ్లమని పవన్ చెప్పారు. ప్రజలు అధికారం ఇచ్చింది మటన్, చికెన్ షాపులు పెట్టడానికా అని ప్రశ్నించారు. వేటకు వెళ్లి చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి.. మూడేళ్లలో కేవలం 64 మత్స్యకార కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చారన్నారు.
ఇకనైనా గంగ పుత్రులు మేల్కోవాలి.. వారిలో చైతన్యం రావాలన్నారు. జీవో 217కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేసే పోరాటానికి అండగా ఉంటానన్నారు పవన్ కల్యాణ్. తాను చావడానికి సిద్ధం.. కానీ తల మాత్రం వంచనని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. మత్స్యకారులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవో 217కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడా వెనుకంజ వేయలేదని పవన్ చెప్పారు. రాష్ట్రంలో 32 మత్స్యకార ఉపకులాలు ఉన్నాయని, రాష్ట్రంలో 65 నుంచి 70 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని తెలిపారు. మత్స్యకారుల కష్టాలు తనకు తెలుసన్నారు పవన్.







