ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యం

UPDATED 6th JUNE 2018 WEDNESDAY 6:00 PM

సామర్లకోట: ప్రజలకు మెరుగైన పాలన అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక రైల్వే కళ్యాణ మండపంలో సామర్లకోట అర్బన్, రూరల్ కు సంబంధించి ఐదవ రోజైన బుధవారం విజ్ఞాన రాష్ట్రం, ఉపాధి కల్పనపై నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా పాల్గొన్నారు. నవ నిర్మాణ దీక్షా ప్రతిజ్ఞ అనంతరం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రజలకు మేలైన సంక్షేమ పథకాలు అందచేసి మెరుగైన పాలన అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశ్యమని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన పథకాలను ప్రవేశపెట్టి వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలు రైతులు నుంచి సేకరించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నదులను అనుసంధానం చేసి ప్రాజెక్టులను నిర్మించడం జరుగుతుందని, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం రూ. 55 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. మన జిల్లాలో గోదావరి జలాలను ఏలేరుకు అనుసంధానించడానికి రూ.1600 కోట్లుతో పురుషోత్తపట్నం ప్రాజెక్టును నిర్మించుకోవడం జరిగిందని, 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. ఇళ్ళులేని నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణానికి రాష్ట్రంలో 19 లక్షల ఇళ్ళు ముఖ్యమంత్రి మంజూరు చేయించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా రుణాలను వివిధ సంక్షేమ పథకాలను పొందడానికి చర్యలు చేపట్టి అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు విద్యకు అధిక నిధులను కేటాయించి పేద ప్రజల పిల్లలను విద్యావంతులుగా చేయడానికి కృషి చేస్తున్నామని, న్యాయమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించడానికి అర్హత కలిగి మెరిట్ గల ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుందని చెప్పారు. ఉచిత విద్యతో పాటు ఉచిత బట్టలు, పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం, స్కూలు భవనాలు, కంప్యూటర్లో శిక్షణ, తదితర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. నిరుద్యోగులకు శిక్షణా నైపుణ్యతా కార్యక్రమాలు, జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మహిళలకు డ్వాక్రా గ్రూపులు ద్వారా రుణాలను అందించి ఆర్థికంగా బలోపేతం చేశామని, వీరికి శిక్షణ కూడ ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో లక్షా 51 వేలు ఓటర్లు కలిగి ఉన్నారని, వీరిలో అర్హత కలిగిన వృద్ధులు, వికాలాగులు, వితంతు పింఛన్లు 30 వేల మందికి అందచేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో డ్రైన్లు, త్రాగునీరు, కమ్యూనిటీ భవనాలు, ప్రార్థనా మందిరాలు, సిసిరోడ్లు, శ్మశానవాటికలు, పంచాయతీ, అంగన్వాడీ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. సామర్లకోట, పెద్దాపురం ప్రధాన రహదారులను, డబల్ రోడ్, సెంటర్ లైటింగుతో అభివృద్ధి చేస్తున్నామని, క్రీడారంగాన్ని ప్రోత్సహించడానికి పెద్దాపురంలో స్టేడియం, స్విమ్మింగ్ పూల్  ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పరిపాలనా సౌలభ్యంకోసం నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలను ఆధునీకరించి నూతన భవనాలు నిర్మిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం చివరికి నూరుశాతం అభివృద్ధి పనులు పూర్తి చేసి రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని ప్రథమస్థానంలో ఉంచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ భారతదేశంలోనే తూర్పుగోదావరి జిల్లా గత సంవత్సరం ఉపాధి హామీ పనులు క్రింద రూ.650 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, వీటిలో పెద్దాపురం నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. బ్యాంకు లింకేజ్ క్రింద నియోజకవర్గంలో 15 కోట్లు రుణాలను వివిధ వర్గాల వారికి ఇప్పించామని, ఈ సంవత్సరం చివరి నాటికి మరిన్ని రుణాలు మంజూరు చేస్తామని అన్నారు. ఈ సంవత్సరం నియోజకవర్గంలో 75 కిలోమీటర్లు సిసి.రోడ్లు పూర్తి చేస్తామని, కాపు, ఎస్సీ, బిసిలకు అధికంగా రుణాలను మంజూరు చేశామని చెప్పారు. పెద్దాపురం నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ పనులు ఆర్ అండ్ బి శాఖ ద్వారా అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే ఆరు నెలల్లో దాదాపు నియోజకవర్గంలో చేపట్టిన అన్ని పనులను పూర్తి చేస్తామన్నారు. అనంతరం రూరల్ కు  సంబంధించి  690 మందికి, పట్టణానికి సంబందించిన 41 మందికి కొత్త పింఛన్లను మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో బుర్రకథ కళారూపం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కళాకారుల ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి, ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, జెడ్పిటిసి గుమ్మళ్ళ విజయలక్ష్మి, ఎఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, ఏఎంసి వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి గంగుమళ్ళ సత్యనారాయణ, పెద్దాపురం ఆర్డీవో  వి. విశ్వేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరరావు, ప్రత్యేక అధికారి రాజశేఖర్, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us