అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించారన్న వ్యవహారంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఈ మేరకు వంగవీటి రాధాకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. గన్‌మెన్లను తిరస్కరించడం సరికాదని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భద్రత విషయంలో అశ్రద్ధ వద్దని చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని.. కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని సూచించారు. ఇటీవల కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో వంగవీటి రంగా విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సభకు హాజరైన మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం, సీఎం దీనిపై పోలీసుల విచారణకు ఆదేశించడం జరిగాయి. ఈ సందర్భంగా వంగవీటి రాధా రక్షణకు 2+2 గన్‌మెన్‌లను కేటాయించాలని పోలీసులను ఆదేశించారని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ మేరకు సాయుధ బలగాల (ఏఆర్) విభాగం నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లను విజయవాడలోని వంగవీటి రాధా నివాసానికి పంపిస్తే తనకు వద్దని ఆయన తిరస్కరించారు. తాను ప్రజాజీవితంలో ఉంటానని, తమ అభిమానులు, ప్రజలే తన ప్రాణాలకు రక్షణగా ఉంటారని ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు.







