రెడ్ బీ న్యూస్, 30 డిసెంబర్ 2021: కుబేరుల ఇళ్లల్లో వేడుకలంటే అంబరాన్నంటాల్సిందే. కళ్లు చెదిరేలా డెకరేషన్లు.. ప్రముఖులు, సెలబ్రెటీల రాకతో ఘనంగా జరుగుతాయి. కానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత రతన్ టాటా మాత్రం వీటన్నింటికీ చాలా దూరంగా ఉంటారు. సామాన్య జీవితాన్నే ఎక్కువగా ఇష్టపడే టాటా.. మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. డిసెంబరు 28న రతన్ టాటా 84వ పుట్టినరోజు. ఆ రోజున భారీ కేకులు, లగ్జరీ పార్టీలు కాకుండా చిన్న కప్ కేకుతో ఆయన తన జన్మదిన వేడుకను జరుపుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను తొలుత వైభవ్ భోయిర్ అనే వ్యక్తి లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. అందులో రతన్ టాటా.. తన అసిస్టెంట్ శంతను నాయుడుతో కలిసి పుట్టినరోజు జరుపుకున్నారు. శంతను బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతుంటే.. చిన్న కప్ కేక్‌పై ఉన్న క్యాండిల్‌ను టాటా ఊదారు. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్ అయ్యింది. రతన్ టాటా నిరాడంబరతకు ముగ్ధులైన నెటిజన్లు ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నో విజయాలను సాధించి కోట్లు గడించినప్పటికీ.. సామాన్య జీవితాన్ని ఇష్టపడుతున్న టాటా.. ఎంతో మందికి ఆదర్శప్రాయమని కొనియాడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 3లక్షల మందికి పైగా వీక్షించారు.







