పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూన్ 02: గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 32 లక్షల ఇళ్ల పట్టాలను మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి పంపిణీ చేశారని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ భూములపై కన్నేసిందని స్థానిక వైయస్సార్సీపి పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి దవులూరి దొరబాబు తీవ్రంగా ఆరోపించారు. స్థానిక విలేకరులతో ఆయన మంగళవారం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. పెద్దాపురం మండలంలోని తాటిపర్తి, చంద్రమాంపల్లి, దివిలి, పులిమేరు, తిరుపతి, తూర్పు పాకలు, కాండ్రకోట, గుడివాడ, సిరివాడ సహా 11 గ్రామాలకు చెందిన సుమారు 2300 మంది పేద లబ్ధిదారులకు ఎలాంటి రాజకీయ విచక్షణ లేకుండా కేటాయించిన 56 ఎకరాల భూమిని లాక్కునేందుకు స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
రహస్యంగా జిందాల్ ఫ్యాక్టరీకి భూముల ధారాదత్తం
గ్రామ సభల్లో ఎలాంటి స్పష్టమైన తీర్మానాలు చేయకుండా, లబ్ధిదారులకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా అర్ధరాత్రి జీఓలతో 16 ఎకరాల ఇళ్ల స్థలాల భూమిని జిందాల్ చెత్త నుండి విద్యుత్ తయారుచేసే ప్లాంట్‌కు రహస్యంగా ధారాదత్తం చేశారని విమర్శించారు. గతంలో ఈ ఫ్యాక్టరీని అనపర్తి, రాజానగరం, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చూస్తే.. అక్కడి స్థానిక ఎమ్మెల్యేలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం వ్యతిరేకించారని గుర్తు చేశారు. కానీ, పెద్దాపురం ఎమ్మెల్యే మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి ఈ కాలుష్య కారక ప్లాంట్‌ను ఇక్కడికి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు.
విద్యాసంస్థలు, విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు
"ప్లాంట్ ఏర్పాటు చేయబోయే ప్రాంతానికి సమీపంలోనే 40 వేల మంది విద్యార్థులు ఉన్న ఆదిత్య యూనివర్సిటీ, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. సుమారు 14 నియోజకవర్గాల నుండి వచ్చే టన్నుల కొద్దీ చెత్త వల్ల ఇక్కడి విద్యార్థులు, ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది." అని ఆందోళన వ్యక్తం చేశారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎం గా పనిచేసిన చిన్నరాజప్ప నియోజకవర్గానికి కొత్తగా రెండు సెంట్ల భూమి కూడా తీసుకురాలేకపోయారని, కానీ ఇప్పుడు ఉన్న భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదమని, ఇది ప్రజల దృష్టిని మళ్లించే 'డైవర్షన్ పాలిటిక్స్' అని విమర్శించారు.
వ్యక్తిగత ఆరోపణలపై పవర్‌ఫుల్ కౌంటర్: పాస్‌పోర్ట్ ప్రదర్శన
తనపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. చిన్నరాజప్ప నా వ్యక్తిగత విషయాలపై కాకుండా, ఇక్కడి అక్కాచెల్లెమ్మల బాధలను, వారికి ఇవ్వాల్సిన పట్టాలను పట్టించుకోవాలని హితవు పలికారు. తన అమెరికా ప్రయాణాలపై క్లారిటీ ఇస్తూ.. చిన్న వయసులోనే తండ్రి అప్పులు చేసి పంపడం వల్ల అమెరికా వెళ్లానని, అక్కడ తనకు చట్టబద్ధమైన వ్యాపారాలు ఉన్నాయని, పిల్లలు చదువుకుంటున్నారని తెలిపారు. గత 10 నెలల్లో కేవలం రెండు సార్లు మాత్రమే (నవంబర్‌లో 7 రోజులు, మేలో 5 రోజులు) అమెరికా వెళ్లానని చెబుతూ తన పాస్‌పోర్ట్‌ను మీడియాకు చూపించారు. తాను కష్టపడి నీతిమంతంగా డబ్బు సంపాదించానని.. ఇతరులలాగా గ్రావెల్ దోపిడీలు, ప్రైవేట్ లేఅవుట్లలో బెదిరింపులు, చెత్త ఫ్యాక్టరీల ద్వారా అక్రమంగా సంపాదించలేదని కౌంటర్ ఇచ్చారు.
అభివృద్ధిపై మీడియా సమక్షంలో సవాల్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రారంభించిన మహా యజ్ఞం, కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఆగిపోయిందని.. మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించి ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. చినరాజప్ప చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చూపించాలని, రాగంపేట లేఅవుట్‌లో తాము చేసిన అభివృద్ధిని చూడటానికి మీడియా తనతో రావాలని కోరారు. రాగంపేటలో సుమారు 220 మంది లబ్ధిదారులకు కోట్లాది రూపాయల విలువైన స్థలాలు ఇచ్చామని, అందులో 140 మంది ఇళ్లు కట్టుకున్నారని, మిగిలిన వారికి కూడా తహసీల్దార్ ద్వారా స్థలాలు చూపించామని వివరించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పేదల భూములను లాక్కోవడం ఆపాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.







