UPDATED 24th JULY 2026 7:00 PM
- పెద్దాపురంలోని శ్రీ లలితా ఇండస్ట్రీస్, పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్‌ల పరిశీలన
- ధాన్యం కొనుగోలు, ప్రజా పంపిణీ తీరుపై అధికారులతో ప్రత్యేక సమీక్ష
- ఏపీ విధానాలను కేరళలోనూ అమలు చేసేందుకు పరిశీలన
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, జూలై 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ఆహార భద్రత మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) పనితీరును అధ్యయనం చేసేందుకు కేరళ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం పెద్దాపురంలోని లలితా ఇండస్ట్రీస్ ప్లాంట్‌ను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో కేరళ పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.ఎం. జయకృష్ణన్ కూడా మంత్రి వెంట ఉన్నారు. ఏపీ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు కేరళ మంత్రికీ సాదర స్వాగతం పలికారు.
లలితా ఇండస్ట్రీస్ సందర్శన - విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
లలితా ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన బుక్స్‌ను ఈ సందర్భంగా మంత్రి అనూప్ జాకబ్ పంపిణీ చేశారు. అనంతరం ప్లాంట్‌లో బియ్యం ఉత్పత్తుల ప్యాకింగ్, ఇతర ప్రాసెసింగ్ విధానాలను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్‌ను కూడా పరిశీలించారు.
ఉత్తమ పద్ధతుల అధ్యయనాన్నే మా లక్ష్యం: మంత్రి అనూప్ జాకబ్
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేరళ మంత్రి అనూప్ జాకబ్... దేశంలోని వివిధ ప్రాంతాలలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడమే తమ ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేశారు.
- ఏపీ విధానాలపై ప్రశంసలు: ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, చెల్లింపుల విధానం, నిల్వ చేసే పద్ధతులు మరియు చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ అత్యంత వేగంగా, సమర్థవంతంగా జరుగుతోందని ఆయన కొనియాడారు.
- కేరళలో మెరుగైన అమలు: గత రెండు రోజులుగా తాము పరిశీలించిన ఈ ఉత్తమ పద్ధతులను లోతుగా అధ్యయనం చేసి, కేరళలోనూ వాటిని మరింత మెరుగైన రీతిలో అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
- పరస్పర సహకారం: కేరళలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక బోనస్ అందిస్తున్నామని, ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భిన్నమైన పద్ధతి అని తెలిపారు. త్వరలో కేరళలోని సరఫరా వ్యవస్థలను పరిశీలించడానికి ఏపీ ఆహార శాఖ మంత్రి కూడా రానుండటం అభినందనీయమన్నారు.
కేరళ పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో సుమారు 1,600 విక్రయ కేంద్రాలు పనిచేస్తున్నాయని, దేశంలోనే ఇది అతిపెద్ద రిటైల్ వ్యవస్థలలో ఒకటని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేరళలో రేషన్ కార్డుదారులకు దాదాపు 13 రకాల సబ్సిడీ వస్తువులతో పాటు వంటగ్యాస్ గోడౌన్లు, ఇంధన నిల్వ కేంద్రాలు వంటి ప్రజా సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో లభించిన అనుభవాలను క్రోడీకరించి, ప్రభుత్వ స్థాయి విధానపరమైన నిర్ణయాల ద్వారా కేరళలో మరింత పకడ్బందీగా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రసన్న లక్ష్మి దేవి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.ఆనంద రావు, ఎఫ్‌సీఐ అధికారులు, కాకినాడ జిల్లా రైస్ మిల్లు అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.







