UPDATED 28th JUNE 2017 WEDNESDAY 7:30 PM
పెద్దాపురం: పెద్దాపురం ఏరియా ఆసుపత్రిని జిల్లాల జాయింట్ కలెక్టర్ ఎ. మల్లికార్జున బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మలేరియా, టైఫాయిడ్, ఫైలేరియా, డెంగ్యూ తదితర విషజ్వరాల బారిన ప్రజలు పడకుండా అప్రమత్తం చేయాలని, అలాగే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు పట్టణ, గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలన్నారు. ముఖ్యంగా తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోళ్ల ఫారాల ద్వారా వచ్చే ఈగలను నియంత్రించడానికి ఆయా యాజమాన్యాలతో మాట్లాడి తీసుకోవలసిన ముందు జాగ్రత్తలపై వారికి తెలియచేయాలన్నారు. అలాగే వారికి నోటీసులు పంపాలని కమీషనర్, తహసీల్దార్లను ఆదేశించారు. అనంతరం పలు అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, ఎంపిడివో వసంత మాధవి, ఆర్ ఐ నరేష్, వైద్యులు మురళీకృష్ణ, వర్మ, సుదీప్తి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ బిక్కిన సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.







