● తల్లీ, బిడ్డ క్షేమం
UPDATED 20th FEBRUARY 2022 SUNDAY 04:00 PM
East Godavari: : ట్రైన్ లో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో ట్రైన్ బాత్ రూమ్ లోనే ఆప్రయాణికురాలు ప్రసవించింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. స్థానిక రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నైలో కాపురం ఉంటున్న వాషకుమారి అనే మహిళ ఆమె భర్తతో కలిసి పుట్టింటికి జార్ఖండ్ బొకారో ఎక్స్ ప్రెస్ లో బయలుదేరింది. సామర్లకోట రైల్వే స్టేషన్ సమీపానికి వచ్చేసరికి వాషకుమారికి ఒక్కసారిగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె భర్త కంగారుపడ్డాడు.. వెంటనే ఆమెను ట్రైన్ బాత్ రూమ్ లోకి తీసుకుని వెళ్లాడు.. దీంతో ఆమె అక్కడే ప్రసవించింది. నెలలు నిండకుండానే ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
దీంతో సహచర ప్రయాణికులు ఆవిషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడంతో సామర్లకోట స్టేషన్ కు ట్రైన్ చేరుకున్న తరువాత ట్రైన్ ను నిలిపివేసి తల్లీ బిడ్డలను కిందకు దింపారు. ముందుగా సమాచారం అందుకోవడంతో రైల్వే ఫ్లాట్ ఫామ్ మీదకు 108 సిబ్బంది చేరుకున్నారు. వెంటనే తల్లీ బిడ్డలకు ప్రథమ చికిత్స అందించారు. అక్కడ నుంచి తల్లీ బిడ్డలను సామర్లకోట సీహెచ్ సీకి తరలించడంతో అక్కడ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ రవీనా లిల్లీ సిబ్బంది స్వర్ణలత, సీతారత్నం చికిత్స అందించారు. తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉండడంతో రైల్వే సిబ్బంది, వైద్య సిబ్బందికి ఆమె భర్త కృతజ్ఞతలు తెలియచేశాడు. అలాగే సకాలంలో స్పందించిన రైల్వే అధికారులు, సిబ్బందిని పలువురు అభినందించారు.







